www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth

వెన్నుపూస పైపొర భాగంలో మత్తు ఎటువంటి సందర్భాలలో ఇవ్వాలన్న నిర్ణయం మీతోపాటు సర్జరీ చేసే డాక్టరు, మత్తు ఇచ్చే డాక్టర్లపై ఆధారపడి ఉంటుంది. బాగా నొప్పులు వస్తూ ఉండి, గర్భాశయం మార్గం ఎక్కువగా సంకోచవ్యాకోచాలకు గురవుతూ ఉంటే సాధారణంగా వెన్నుపూస పైపొరకు మత్తు ఇస్తారు. వెన్నుపూస భాగంలో మత్తు తీసుకోవాలన్న ఆసక్తి మీలో ఏమాత్రం ఉన్నా, మిమ్మల్ని ముందుగా అనస్తీసియా డాక్టరును చూడాల్సిందిగా కోరతాము. ఆయన మీ వైద్య చికిత్సా చరిత్రను పరిశీలించి, పరీక్షలు నిర్వహించడానికి ఇది దోహదం చేస్తుంది. నొప్పులు ఇంకా తీవ్రం కాకముందే, భాధ తెలియకుండా ప్రసూతి కావడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. రకరకాల అవకాశాల్లో మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారో తెలియజేస్తూ మత్తు డాక్టరుకు ఒక ఆమోదపత్రం సంతకం చేసి ఇవ్వాలి. అయితే అంతమాత్రం చేతనే వెన్నుపూస పైపొరకు మత్తు తీసుకోవాల్సిన్ అగత్యం ఏదీ మీపై ఉండదు. ఆ తర్వాత కూడా సహజ ప్రసూతి మార్గాన్ని ఎంచుకోవచ్చు లేక మరేదైనా బాధా నివారణ మార్గాన్ని ఎంచుకోవచ్చు.

మీకు వెన్నుపూస పైపొరకు మత్తు ఇవ్వాలా లేదా అన్నది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. జననాంగంలో పాప ఏ స్థితిలో ఉంది? తొలి కాన్పా?నన్న అంశాలు కూడా కీలకపాత్ర వహిస్తాయి. వెన్నుపూసకు మత్తు ఇవ్వడానికి ముందు నొప్పుల వల్ల గర్భాశయ ద్వారం వెడల్పు మరో నాలుగు సెంటీమీటర్లు పెరగాలని కొందరు డాక్టర్లు నియమంగా భావిస్తారు. ముందుగా వెన్నుపూసకు మత్తు ఇస్తే, నొప్పులు ఆలస్యం అవుతాయని వారు భావించి ఉండవచ్చు. అయితే ఈ అంశంపై లభిస్తున్న సమాచారం వివాదాస్పదమైనది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చాలా ముందుగానే వెన్నుపూస పైపొరకు మత్తుమందు ఇవ్వాల్సి రావచ్చు. ప్రసూతి వైద్య నిపుణుడు తన అనుమతి ఇవ్వగానే మత్తు డాక్టరు వెన్నుపూస పైపొరకు మత్తుమందు ఇస్తారు. మత్తుడాక్టరును ముందుగా చూసి ఉండకపోయి ఉంటే, ఆయన అప్పటికప్పుడు మీ వైద్య చికిత్సా చరిత్రను పరిశీలించి, పరీక్షలు నిర్వహిస్తారు. మత్తు తీసుకోవడానికి మీనుంచి ఆమోదపత్రం తీసుకుంటారు.

శిశువు తల బయటకి కనిపించేలోపు ఎప్పుడైనా వెన్నుపూస పైపొరకు మత్తు ఇవ్వవచ్చు. తొలుత సహజ ప్రసూతికోసం ప్రయత్నించి, నొప్పులు మరీ తీవ్రం అయినప్పుడయినా ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. అంతకుముందు మత్తు డాక్టరును సంప్రదించకపోయినా సరే. ప్రసూతి విద్యా తరగతులకు మీరు హాజరయి, వివిధ రకాల బాధా నివారణ ప్రత్యామ్నాయాలను గురించి తెలుసుకోవడం మంచిదని మేము సిఫారసు చేస్తాము. అన్నింటినీ మించి మీరు ప్రసూతికి ముందుకాలంలోనూ, నొప్పుల సమయంలోనూ అపోహలకు అతీతంగా, విశాల ద్రుష్టి, వెసులుబాటుతత్వం కలిగి ఉండాలి. మనుషులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ప్రసూతి నొప్పులు వస్తుంటాయి. మీరు ఎంత విశాల మనస్కులయితే మీకు, మీ బిడ్డకు అంతగా ప్రయోజనం ఉంటుంది.

అమెరికా ప్రసూతి వైద్యులు, స్త్రీ వైద్యనిపుణుల కళాశాల తాజా అభిప్రాయం, ఫిబ్రవరి 2002:

గర్భాశయ ద్వారం విస్తరించడానికి ముందు వెన్నుపూసకు మత్తు మందు తీసుకున్న తొలిచూరు మహిళల్లో సిజేరియన్ చేయవలసిన పరిస్థితులు తలెత్తుతున్నాయని ఒక వాదన ఉంది.దీనికి సంబందించి లభిస్తున్న రకరకాల సమాచారం పరస్పరం విరుద్దంగా, వివాదాస్పదంగా ఉంది. అయినా దీని పర్యవసానంగా కొన్ని సంస్థలు వెన్నుపూసకు మత్తు మందు ఇవ్వడానికి ముందు నొప్పులు పడుతున్న మహిళ గర్భాశయద్వారం నాలుగైదు సెంటీమీటర్లు విస్తరించాలని నియమంగా పెట్టుకున్నాయి. ఈ సంస్థలు పేషంట్ల అవసరాలకు అనుగుణంగా సొంత చికిత్సా విధానాలను అభివ్రుద్ది పర్చుకున్నయేమో స్పష్టంగా తెలియదు. నొప్పులు ఎక్కువయ్యే కొద్దీ గర్భిణులు తీవ్రమైన బాధను అనుభవించవలసి వస్తుంది. వారు అంతతీవ్రంగా బాధపడుతున్నప్పుడు, ఆ బాధను నివారించడానికి సురక్షితమైన చికిత్సా విధానాలు ఉన్నప్పుడు జోక్యం చేసుకోకుండా ఉండడం వైద్యసూత్రాల ప్రకారం ఆమోదయోగ్యం కాదు. అందువల్ల, వైద్యపరంగా ప్రతికూల సూచనలు ఉంటే తప్ప, నొప్పుల సమయంలో గర్భిణి కోరితే వెంటనే బాధా నివారణ చర్యలు చేపట్టాలని అమెరికా ప్రసూతి వైద్యులు, స్త్రీ వైద్యనిపుణుల కళాశాల, అమెరికా అనస్తీసియాలజిస్టుల సంస్థలు సంయుక్తంగా అభిప్రాయపడ్డాయి. ఎటువంటి బాధానివారణ చర్యలు చేపట్టాలన్న విషయంలో ప్రసూతి వైద్యులు, మత్తు డాక్టర్లు, పేషంటు, ఇతర సహాయక సిబ్బంది సమన్వయంతో నిర్ణయం చేయాలి.

సంప్రదించిన గ్రంధాలు: ప్రాక్టీస్ గైడ్ లైన్స్ ఆఫ్ ఆబ్స్టెరిక్ అనస్తీసియా, అనస్తీసియాలజీ 1999;90:600


తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి 

  


Copyright © 2018 - Bhavani Shankar Kodali MD